జమ్మికుంట: గ్రామపంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సీఐటీయూ ఆధ్వర్యంలో ఆగస్టు 18, 19 తేదీల్లో అన్ని మండలాల ఎంపీడీవో కార్యాలయాల ఎదుట నిర్వహించనున్న దీక్షలను జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి కొప్పుల శంకర్ పిలుపునిచ్చారు. మంగళవారం చెల్పూర్ గ్రామపంచాయతీ వద్ద కార్మికులతో కలిసి దీక్షలకు సంబంధించిన పత్రికా ప్రకటన విడుదల చేశారు.
ఈ సందర్భంగా కొప్పుల శంకర్ మాట్లాడుతూ గ్రామపంచాయతీ కార్మికులకు ప్రతి నెల 1వ తేదీన వేతనాలు చెల్లించాలని ముఖ్యమంత్రి ఆదేశించినప్పటికీ క్షేత్రస్థాయిలో అధికారులు, ప్రజాప్రతినిధులు ఆదేశాలను అమలు చేయడం లేదని ఆరోపించారు. ప్రభుత్వం కార్మికుల వేతనాల కోసం బడ్జెట్ కేటాయించి నిధులు విడుదల చేస్తున్నప్పటికీ, గ్రామస్థాయిలో పంచాయతీ కార్యదర్శులు, సర్పంచుల ఒత్తిళ్ల కారణంగా కార్మికులకు సకాలంలో వేతనాలు అందడం లేదన్నారు.
చెల్పూర్ గ్రామపంచాయతీలోనే గత రెండు నెలలుగా కార్మికులకు వేతనాలు బకాయి ఉన్నాయని, వెంటనే పెండింగ్ వేతనాలను చెల్లించాలని డిమాండ్ చేశారు.
గ్రామపంచాయతీ కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని, వేతనాలను ప్రభుత్వం నేరుగా కార్మికుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని కోరారు. మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయడంతో పాటు ఆన్‌లైన్‌లో నమోదు కాని కార్మికుల పేర్లను నమోదు చేయాలని, పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే కార్మికులకు ప్రభుత్వం రూ.20 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని కోరారు.
ఈ డిమాండ్ల సాధన కోసం రాష్ట్ర యూనియన్ పిలుపు మేరకు ఆగస్టు 18, 19 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండలాల ఎంపీడీవో కార్యాలయాల ఎదుట దీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గ్రామపంచాయతీ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో శనిగరపు కొమురయ్య, నగునూరు మనక్క, అంతడుపుల సరోజన, నిజానపురి సంపత్, సమ్మయ్య, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.








