జమ్మికుంట, ఆగస్టు 13: హమాలి కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆల్ మండల్ హమాలి వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో గురువారం జమ్మికుంట తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.
ఈ కార్యక్రమానికి CITU జిల్లా సహాయ కార్యదర్శి కొప్పుల శంకర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ, హమాలి కార్మికులు అనేక సంవత్సరాలుగా ఎగుమతులు, దిగుమతుల పనుల్లో కీలకంగా పనిచేస్తున్నప్పటికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందడం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్ల ఎనిమిది నెలలు గడుస్తున్నా, ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా హమాలి కార్మికుల కోసం వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయలేదని విమర్శించారు.
హమాలి కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేసి సంక్షేమ పథకాలు అమలు చేయాలని, హెల్త్ కార్డులు జారీ చేసి ఉచిత వైద్య సేవలు అందించాలని డిమాండ్ చేశారు. 55 సంవత్సరాలు పైబడిన హమాలి కార్మికులందరికీ నెలకు రూ.6,000 పింఛన్ అందించాలని కోరారు.
ఇండ్లు లేని హమాలి కార్మికులకు ప్రభుత్వం భూమి కొనుగోలు చేసి, 120 గజాల స్థలంలో ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇవ్వాలని, ప్రతి కార్మికుడికి ప్రభుత్వం నేరుగా గుర్తింపు కార్డులు జారీ చేయాలని అన్నారు. ప్రమాదాల్లో మరణించే హమాలి కార్మికుల కుటుంబాలకు రూ.25 లక్షల నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు.
హమాలి కార్మికుల ఇతర సమస్యలను కూడా ప్రభుత్వం వెంటనే పరిష్కరించి, వారి సంక్షేమానికి తగిన చర్యలు తీసుకోవాలని CITU నాయకులు డిమాండ్ చేశారు.
ఈ ధర్నాలో హమాలి సంఘం నాయకులు జక్కుల రమేష్ యాదవ్, రావుల ఓదేలు, కొండ్ర క్రాంతి, మారపల్లి కిరణ్, పుట్టపాక రాజేందర్, సంతోష్, సుమన్, శ్రీనివాస్, ప్రవీణ్, సురేష్, శివబండి తదితరులు పాల్గొన్నారు.








