జమ్మికుంట: పట్టణంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి వేడుకలను దేశిని కోటి గౌడ్ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి ప్రముఖులు, గౌడ సంఘం నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి జయంతి వేడుకలను నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్మన్ ములుగు ప్రశాంత్ కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ పుల్లూరి స్వప్న సదానందం, వైస్ చైర్మన్ ఎర్రం సతీష్ రెడ్డి, దుబ్బ మల్లన్న, చైర్మన్ రవీందర్, ఆకుల రాజేందర్, కనుమల్ల గణపతి, కార్మిక నాయకులు సామ్రాజ్యం, కోలాగాని రాజు తదితరులు హాజరయ్యారు. గౌరవ కౌన్సిలర్లు శ్రీపతి నరేష్, మాచర్ల రాజు, గుర్రం కావ్య, పరశురాం, కుదాడి తిరుపతి, బత్తుల లక్ష్మణ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ములుగు ప్రశాంత్ కుమార్, దేశిని కోటి, మరెల్లి మల్ల గౌడ్ మాట్లాడుతూ.. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ భూస్వాములు, పెత్తందారుల అరాచకాలు, ప్రజలపై విధించిన అధిక పన్నులకు వ్యతిరేకంగా పోరాడారని తెలిపారు. ప్రజలకు స్వేచ్ఛ, సమాన హక్కులు కల్పించాలనే లక్ష్యంతో తన అనుచరులతో కలిసి గెరిల్లా సైన్యాన్ని ఏర్పాటు చేసి మొఘల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడారని పేర్కొన్నారు.
గోల్కొండ కోటపై పోరాటం చేసి తన పరాక్రమాన్ని చాటుకున్న సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కొంతకాలం రాజుగా ప్రజా సంక్షేమ పాలన సాగించారని వారు గుర్తుచేశారు. ఆయన ధైర్యం, ప్రజాస్వామ్య భావాలు, సమానత్వం కోసం చేసిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని అన్నారు.
సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని, కులమతాలకు అతీతంగా ఆయన ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ ట్యాంక్‌బండ్ వద్ద సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
కార్యక్రమంలో మార్కెట్ డైరెక్టర్లు గడ్డం దీక్షిత్, రాజేశ్వరరావు, గౌడ నాయకులు నాగపురి రాజు, ప్రభాకర్ రాజు, నాయకులు పూదరి రేణుక, శివ, బొంగోని వీరన్న, మరపల్లి బిక్షపతి, శ్రీహరి, పంజాల అజయ్, దేశిని శ్రీనివాస్, పున్నం శీను, పాత ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.








