బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చే వరకు పోరాటం ఆగదు: బీసీ నాయకులు

జమ్మికుంట: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసేంతవరకు పోరాటం ఆగదని బీసీ ఉద్యోగస్తుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దబ్బేట రవీందర్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి టంగుటూరి రాజ్ కుమార్, మండల అధ్యక్షుడు ఏ బూసి శ్రీనివాస్ స్పష్టం చేశారు. జమ్మికుంటలోని చాణక్య డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.
ఈ నెల 18న బీసీ జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన జమ్మికుంట బంద్ స్వచ్ఛందంగా, సంపూర్ణంగా జరిగిందని తెలిపారు. ఈ బంద్‌కు సహకరించిన వ్యాపార, వాణిజ్య సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలకు, పట్టణ, మండల ప్రజలకు, ఇతర రాజకీయ పార్టీలు, కుల సంఘాల నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
42 శాతం రిజర్వేషన్‌ను అసెంబ్లీలో అన్ని పార్టీల మద్దతుతో తీర్మానం చేసి గవర్నర్‌కు పంపడం సంతోషకరమన్నారు. అయితే, సుప్రీంకోర్టుకు అగ్రకులాలకు చెందిన ఒక వ్యక్తి రిజర్వేషన్లు ఇవ్వరాదని పిటిషన్ వేయడంతో కోర్టు కొట్టివేయడం బాధాకరమన్నారు.
అన్ని రాజకీయ పార్టీలు బీసీ రిజర్వేషన్‌కు మద్దతు ఇస్తున్నందున, కాంగ్రెస్ పార్టీ, రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి అన్ని రాజకీయ పార్టీల నాయకులతో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి, కేంద్ర ప్రభుత్వం, మోడీని ఒప్పించి పార్లమెంటులో బిల్లు పాస్ అయ్యే విధంగా చూడాలని కోరారు. లేనియెడల బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలిపారు.
తమిళనాడులో ఎస్సీ, ఎస్టీలకు 19 శాతం, బీసీలకు 50 శాతం కలిపి మొత్తం 69 శాతం రిజర్వేషన్ అమలు జరుగుతుందని గుర్తు చేశారు. అవసరమైతే అక్కడ రిజర్వేషన్లు ఎలా అమలు చేస్తున్నారో ప్రత్యేక కమిటీ వేసి అధ్యయనం చేసి, తెలంగాణలో తప్పకుండా 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు సమ్మెట సదానందం, దాసరి రామ్మూర్తి గౌడ్, ధర్ముల శంకర్, రావుల తిరుపతి, గండి రంజిత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
aditya hospital banner

Also read:

0
Would love your thoughts, please comment.x
()
x
Listings News Offers Jobs Videos