జమ్మికుంట: బీసీ హక్కులు బీసీలకే దక్కాలి, బీసీ రిజర్వేషన్లు ప్రజాస్వామిక హక్కే” అనే నినాదంతో మానవ హక్కుల వేదిక (HRF) ఆధ్వర్యంలో రేపు (నవంబర్ 20, బుధవారం) ఇందిరానగర్ లోని దినేష్ కన్వెన్షన్ హాల్‌లో భారీ బీసీ సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు మద్దతుగా, దూదేకుల నూర్భాష జమ్మికుంట మండల అధ్యక్షుడు మహమ్మద్ బందే అలీ ఆధ్వర్యంలో ఈ రోజు పోస్టర్‌ను ఆవిష్కరించారు. గుల్జార్ మస్జిద్ (జామ మస్జిద్) అధ్యక్షుడు హుస్సేన్ ఈ పోస్టర్‌ను ఆవిష్కరించారు.
మహమ్మద్ బందే అలీ మాట్లాడుతూ, బీసీ రిజర్వేషన్ల సాధనకై నిర్వహిస్తున్న ఈ సదస్సును అన్ని వర్గాల బీసీలు, యువతీ యువకులు, మహిళలు, విద్యార్థులు, మేధావులు, నాయకులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. బీసీ రిజర్వేషన్లు (BC- A, B, E) కోరుకునే వారందరూ తరలిరావాలని ఆయన కోరారు.
మానవ హక్కుల వేదిక డా. తిరుపతయ్య ఆధ్వర్యంలో జరిగే ఈ సదస్సుకు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, 42% బీసీ రిజర్వేషన్ సాధన సమితి నాయకులు టి. చిరంజీవి, కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్ మురళీ మనోహర్, మానవ హక్కుల వేదిక నాయకులు ఎస్. జీవన్ కుమార్, సామాజిక న్యాయ వేదిక నాయకులు రంగు రాజేశం హాజరుకానున్నారు.
ఈ సందర్భంగా బందే అలీ మాట్లాడుతూ, విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లోనే కాక, స్థానిక సంస్థలు, చట్టసభలలోనూ తమ జనాభా దామాషాలో రిజర్వేషన్లు సాధించేందుకు బీసీ వర్గాలకు చెందిన విద్యార్థులు, యువకులు, మహిళలు, నిరుద్యోగులు, వివిధ రాజకీయ పార్టీల్లోని బీసీ నాయకులందరూ ఏకమై పోరాడాలని కోరారు. 42 శాతం రిజర్వేషన్లను అమలు చేసే విధంగా అధికారంలో ఉన్న, రాగల అన్ని పార్టీలను డిమాండ్ చేయాలన్నారు.
రిజర్వేషన్లకు కోర్టులు అడ్డురాని విధంగా, రాజ్యాంగ సమ్మతంగా చట్టం చేయాలని, రాష్ట్రంలోనే కాకుండా కేంద్ర సంస్థల్లోనూ ఆ మేరకు రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ చేశారు. అంతేకాక, ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్లు అమలు చేయాలని, బీసీలలో ఏ, బి, సి, డి, ఈ వర్గీకరణను రాజకీయ రంగంలోనూ వర్తింపజేయాలని వారు అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ నాటికి పెంచిన రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో మస్జిద్ ఇమామ్ జహీరుల్ ఖాద్రి, వహీద్, అక్బర్, అలిం, అష్రఫ్, సజ్జద్ మహమ్మద్, రషీద్, వి.ఆర్. చారి, స్టార్ మొబైల్స్ ఫక్రోద్దీన్, షరీఫ్, అరీఫ్ అబ్బు తదితరులు పాల్గొన్నారు.







