లెదర్ ఇండస్ట్రీస్ పార్కులను వెంటనే పునరుద్ధరించాలి: మాదిగ హక్కుల దండోరా

2025 అక్టోబర్ 18
కరీంనగర్ జిల్లా, జమ్మికుంట: లెదర్ పార్కులను యుద్ధప్రాతిపదికన పునరుద్ధరించి అందుబాటులోకి తీసుకురావాలని మాదిగ హక్కుల దండోరా (ఎంహెచ్‌డి) జాతీయ అధ్యక్షులు దండు సురేందర్ మాదిగ, రాష్ట్ర అధ్యక్షులు కొంగరి శంకర్ మాదిగ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.
జమ్మికుంట గాంధీ చౌరస్తాలో లెదర్ పార్క్ సాధన చర్మకార ఉత్పత్తిదారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న నిరాహార దీక్షలో పాల్గొన్న సందర్భంగా వారు మాట్లాడారు. సుమారు 11 సంవత్సరాల క్రితం చర్మకారుల అభివృద్ధి కోసం ఉమ్మడి పది జిల్లాలలో లెదర్ పార్కుల కోసం స్థలాలు కేటాయించినా, నేటికీ అవి తెరుచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధుల వాటాల పేరుతో సాకులు చెప్పి తప్పించుకుంటున్నాయని విమర్శించారు.
లెదర్ పార్కుల కోసం కేటాయించిన స్థలాలను దోపిడీదారులు కబ్జా చేస్తున్నారని, వెంటనే రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని వాటిని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వాటా కింద 20% నిధులను వెంటనే కేటాయించి, కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు సిద్ధం కావాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి నడవడానికి తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.
అలాగే, స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లలో లెదర్ టెక్నాలజీని కోర్సుగా ప్రవేశపెట్టి ఆధునిక శిక్షణకు ప్రోత్సాహం అందించాలని, లెదర్ పార్కులలో చర్మకారులకు ఇంటి స్థలాలు, నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు రేపటి బీసీ తెలంగాణ రాష్ట్ర బంద్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. కేంద్ర మంత్రులను కలిసి చర్చిస్తామని, సమస్య పరిష్కారం కాకపోతే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎంహెచ్‌డి రాష్ట్ర కార్యదర్శి వడ్డెపల్లి శ్రీనివాస్, కరీంనగర్ జిల్లా అధ్యక్షులు రేణికుంట్ల కుమార్, చర్మకార సంఘం అధ్యక్షులు మోతే స్వామి తదితరులు పాల్గొన్నారు.

aditya hospital banner

Also read:

Listings News Offers Jobs Contact