తేదీ: అక్టోబర్ 14, 2025
జమ్మికుంట: రాబోయే ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి పత్తి క్రయవిక్రయాలపై చర్చించేందుకు వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ), జమ్మికుంట ఛైర్‌పర్సన్ శ్రీమతి పుల్లూరి స్వప్న – సదానందం గారు మరియు పాలకవర్గం అధ్యక్షతన ఈ రోజు (అక్టోబర్ 14, 2025) సాయంత్రం 5:00 గంటలకు కాటన్ మార్కెట్ కార్యాలయంలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పత్తి వ్యాపారస్థులు, ట్రేడర్లు, మరియు అర్తి దారులు పాల్గొన్నారు.
ఛైర్‌పర్సన్ మాట్లాడుతూ, రైతులకు న్యాయం జరగాలని, మంచి గిట్టుబాటు ధరలు లభించాలని స్పష్టం చేశారు. మార్కెట్ యార్డులో కేటాయించిన ధరే మిల్లుల వద్ద కూడా ఉండేలా చూడాలని, లేనిపక్షంలో చర్యలు తీసుకుంటామని వ్యాపారులను హెచ్చరించారు.
రైతు సోదరులకు ఆమె ముఖ్య సూచన చేశారు: మంచి ధరలు పొందడానికి పత్తిని ఇంటి వద్ద ఆరబెట్టి, శుభ్రపరిచి మార్కెట్‌కు తీసుకురావాలి. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సీసీఐ (CCI) మద్దతు ధర రూ. 8,110/- ఉందని తెలిపారు. సీసీఐకి పత్తి అమ్ముకోవాలనుకునే రైతులు తప్పనిసరిగా తమ ఆధార్ కార్డు, పట్టాదార్ పాస్‌పుస్తకం, ఫోన్ నంబర్‌తో మండల ఏఈఓ (AEO) గారి వద్ద స్లాట్ బుక్ చేసుకోవాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ వైస్-ఛైర్మన్, పాలకవర్గం సభ్యులు, మార్కెట్ కార్యదర్శి ఆర్. మల్లేశం, ద్వితీయ శ్రేణి కార్యదర్శి ఎన్. రాజా, అర్తి దారులు, ట్రేడర్లు, మరియు మార్కెట్ సిబ్బంది పాల్గొన్నారు.







