జమ్మికుంట: మానవ హక్కుల వేదిక (హెచ్‌ఆర్‌ఎఫ్) ఆధ్వర్యంలో ‘బీసీల హక్కులు బీసీలకు దక్కాలి’ అనే నినాదంతో ఈ నెల 19న (బుధవారం) దినేష్ కన్వెన్షన్, జమ్మికుంటలో చైతన్య సదస్సు జరగనుంది. కాంగ్రెస్ పార్టీ 42 శాతం రిజర్వేషన్ హామీ ఇచ్చిన నేపథ్యంలో, ఈ హక్కులను సాధించుకోవడంపై బీసీ సమాజం సంఘటితం కావాలని సదస్సు కోరింది.
విద్య, ఉద్యోగ, ఉపాధి, చట్టసభల్లో జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని, ప్రైవేటు రంగంలోనూ అమలు చేయాలని హెచ్‌ఆర్‌ఎఫ్ డిమాండ్ చేసింది. దీనిపై పోరాటానికి సన్నద్ధం కావాల్సిన చారిత్రక సందర్భం ఇదని పేర్కొంది. ఈ సమావేశంలో రిటైర్డ్ ఐఏఎస్ టి. చిరంజీవులు, ప్రొఫెసర్ మురళీ మనోహర్ (కేయూ), ఎస్. జీవన్ కుమార్ (హెచ్‌ఆర్‌ఎఫ్) సహా పలువురు ప్రముఖులు ప్రసంగించనున్నారు. స్థానిక నాయకులు, కార్యకర్తలను ఆహ్వానిస్తున్నట్టు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. ఎస్. తిరుపతయ్య తెలిపారు.








