జమ్మికుంట (హుజూరాబాద్), అక్టోబర్ 12, 2025:
ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు, హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి ప్రణవ్ బాబు సూచనల మేరకు జమ్మికుంటలో బ్లాక్ కాంగ్రెస్, పట్టణ మండల కాంగ్రెస్ పార్టీల ఆధ్వర్యంలో “ఓట్ చోర్” కార్యక్రమం నిర్వహించారు.
దేశంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల ఓట్లను అక్రమంగా తొలగిస్తూ ‘చోర్’ చేస్తుందని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. ఈ విషయంపై తమ నాయకులు రాహుల్ గాంధీ ఇప్పటికే ఆధారాలతో భారత ఎన్నికల సంఘానికి (ఈసీ) పలుమార్లు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
భారత రాజ్యాంగం పౌరులకు ఇచ్చిన ఓటు హక్కును కాపాడాలని కోరుతూ ఈసీకి పంపేందుకు ప్రజల నుండి సంతకాలను సేకరించారు. జమ్మికుంట కాంగ్రెస్ బ్లాక్ అధ్యక్షుడు మోలుగూరి సదయ్య నాయకత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో, ప్రతి పౌరుడి ఓటరు కార్డును ఫోటోతో సహా ప్రదర్శించాలని, అఫిడవిట్ లేకుండా ఓటును తొలగించకూడదని ఈసీని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు సుంకరి రమేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి గూడెపు సారంగపాణి, మాజీ సర్పంచ్ పొనగంటి మల్లయ్యతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.







