ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో అథ్లెటిక్స్ స్టేడియం నిర్మించరాదు – విద్యార్థి సంఘాల జేఏసీ డిమాండ్‌

జమ్మికుంట, సెప్టెంబర్ 15, 2025:
జమ్మికుంట పట్టణంలో గల ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో అథ్లెటిక్స్ మినీ స్టేడియం నిర్మించాలనే కలెక్టర్ ఆదేశాలను నిరసిస్తూ… అఖిలపక్ష విద్యార్థి సంఘాల నాయకులు (జేఏసీ) ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ మేరకు ఆదేశాలు కళాశాల ప్రిన్సిపల్‌కు అందినట్లు తెలుసుకున్న జమ్మికుంట అఖిలపక్ష విద్యార్థి సంఘాల నాయకులు వెంటనే కళాశాలకు వెళ్లి ప్రిన్సిపల్‌కు వినతిపత్రం అందజేశారు.

ముందుగా ఆక్రమణల తొలగింపు చేపట్టాలి: విద్యార్థి సంఘాల జేఏసీ డిమాండ్‌

తదనంతరం మీడియాతో మాట్లాడుతూ… గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్థలం 20 ఎకరాల నుంచి 8 ఎకరాలకు తగ్గిపోయిందని జేఏసీ నాయకులు తెలిపారు. దీనిపై గతంలో పలుమార్లు కరీంనగర్‌లోని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
అథ్లెటిక్స్ మినీ స్టేడియం నిర్మాణం చేపడితే కళాశాల మైదానాన్ని రోజువారీ వాకింగ్‌కు ఉపయోగించే వారికి, పరిసర ప్రాంతాల పిల్లలు ఆడుకోవడానికి వచ్చే వారికి స్వేచ్ఛకు భంగం కలుగుతుందని నాయకులు తెలియజేశారు.
కళాశాలకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు చేపడితే అంగీకరిస్తామని, అయితే ఈ మినీ స్టేడియం నిర్మాణాన్ని చేపట్టాలనుకుంటే ముందుగా కబ్జాకు గురైన స్థలాల్లోని అక్రమ నిర్మాణాలను కూల్చివేసి, కళాశాల స్థలాన్ని కళాశాలకు అప్పజెప్పిన తరువాతనే స్టేడియం నిర్మాణం గురించి చర్చించాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో గట్టు సాయిరాం, అమ్మ వెంకటేష్ యాదవ్, MD సజ్జద్, మాదారం రత్నాకర్, సుధీర్, రాజేష్, విష్ణు, నవీన్, సందీప్ తదితరులు పాల్గొన్నారు.

aditya hospital banner

Also read:

Listings News Offers Jobs Contact