17 అక్టోబర్ 2025
బీసీల ఉద్యమాలన్నింటికీ బిఆర్‌ఎస్ పార్టీ అండగా ఉంటుంది: సింగిల్ విండో చైర్మన్
కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని ఎంపీఆర్ గార్డెన్‌లో సింగిల్ విండో చైర్మన్ పొనగంటి సంపత్, కొత్తపల్లి మాజీ సర్పంచ్ బొద్దుల రవీందర్, మాజీ ఎంపీటీసీ తోట లక్ష్మణ్ మాట్లాడారు. బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ తీసుకున్న నిర్ణయం అమలు కాకుండా జరుగుతున్న కుట్రలకు నిరసనగా బీసీ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు రేపు (18) జరగబోయే తెలంగాణ బంద్‌ను పాటించాలని వారు విజ్ఞప్తి చేశారు.
‘మొత్తం రిజర్వేషన్లు 50% దాటవద్దు’ అనే సాకుతో బీసీలకు అన్యాయం చేస్తున్నారని సంపత్ అన్నారు. ఎస్సీ, ఎస్టీల మాదిరిగానే బీసీలు కూడా పేదరికంలో మగ్గుతున్నారని, సామాజికంగా వెనుకబాటుకు గురవుతున్నారని పేర్కొన్నారు. 10 శాతం జనాభా ఉన్న ఓసీలకు 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కల్పించినప్పుడు అడ్డురాని 50% నిబంధన, బీసీల విషయంలో ఎందుకు వస్తుందని ప్రశ్నించారు.
బీసీలకు జరుగుతున్న అన్యాయాలపై జరిగే అన్ని పోరాటాలకు అన్ని కుల సంఘాలు అండగా ఉంటాయని తెలిపారు. 18న జరిగే రాష్ట్ర బంద్‌లో అన్ని ప్రాంతాల్లో స్వచ్ఛందంగా పాల్గొనాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రాబోయే కాలంలో రాష్ట్రవ్యాప్తంగా జరిగే బీసీ ఉద్యమాల్లో బిఆర్‌ఎస్ పార్టీ ప్రధాన పాత్ర పోషించబోతోందని ఈ సందర్భంగా తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో సైదాబాద్ మాజీ సర్పంచ్ రాజారాం, మడిపల్లి మాజీ సర్పంచి పరశురాములు గౌడ్, యోబుసి కౌశిక్, దయ్యాల శ్రీనివాస్, ఆకుల నారాయణ, తదితరులు పాల్గొన్నారు.







