(అక్టోబర్ 12, 2025, జమ్మికుంట లోకల్)
జమ్మికుంట: నియోజకవర్గంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై ఎంపీ ఈటెల రాజేందర్ కుట్రపూరిత రాజకీయాలకు పాల్పడుతున్నారని జమ్మికుంట సింగిల్ విండో ఛైర్మన్ పొనగంటి సంపత్ తీవ్రంగా ఆరోపించారు. రాజకీయ రంగప్రవేశం చేసిన కొద్ది కాలంలోనే కౌశిక్ రెడ్డి ప్రజల గుండెల్లో స్థానం సంపాదించారని, నిస్వార్థంగా సేవలందిస్తూ నియోజకవర్గానికి ధైర్యాన్ని, స్థైర్యాన్ని ఇచ్చారని సంపత్ కొనియాడారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కూడా ఈటెల రాజేందర్ హుజూరాబాద్‌ను “చీడ”లా పట్టిపీడిస్తున్నారని, ఎమ్మెల్యేపై అసత్య ఆరోపణలు గుప్పిస్తూ క్షుద్ర రాజకీయాలకు తెరలేపారని ఆయన విమర్శించారు. కేసీఆర్‌ను మోసం చేసి, బీఆర్‌ఎస్‌కు ద్రోహం చేసిన ఈటెల అవినీతితో వేల కోట్లు సంపాదించారని, ఇప్పుడు ప్రజాదరణ లేక నియోజకవర్గాన్ని అస్థిరపరిచేందుకు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్‌ఎస్ కార్యకర్తలు, ప్రజలు కౌశిక్ అన్నను కాపాడుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.







