కరీంనగర్/జమ్మికుంట, అక్టోబర్ 13, 2025:
జమ్మికుంట మండలం మడిపల్లి, చెల్పూర్ గ్రామాలకు చెందిన ప్రజలు, రైతులు ఈరోజు (అక్టోబర్ 13, 2025) ప్రజావాణిలో జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పించారు. మడిపల్లిలోని 18-ఈ రైల్వే గేటు వద్ద తలపెట్టిన ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణాన్ని రైల్వే అధికారులు మొదట సర్వే చేసిన ప్లాన్ ప్రకారమే నిర్మించాలని వారు కోరారు.
రైల్వే అధికారులు పాత దారిలో, ప్రభుత్వ భూమి ఎక్కువగా వచ్చేలా చేసిన ప్లానింగ్ ఎవరికీ ఎక్కువ నష్టం కలిగించదని గ్రామస్తులు తెలిపారు. అయితే, కొందరు వ్యక్తులు కావాలనే ఈ నిర్మాణాన్ని అడ్డుకుంటున్నారని ఆరోపించారు.
ఈ వంతెన మడిపల్లి, చెల్పూర్ ప్రజలకు మాత్రమే కాకుండా, కనగర్తి, శ్రీరామపల్లె, లక్మాచపల్లి, అంకుశపూర్, భీంపల్లి వంటి పలు గ్రామాల ప్రజలకు కూడా హుజూరాబాద్, కరీంనగర్‌లకు వెళ్లేందుకు 12 నుండి 15 కిలోమీటర్ల దూరం తగ్గిస్తుందని వివరించారు. ఈ ప్రాంతంలో ఇప్పటికే రూ. 5 కోట్లతో రోడ్డు, రూ. 2 కోట్లతో వాగుపై బ్రిడ్జి నిర్మాణాలు జరిగాయని గుర్తు చేశారు. అధికారులు గతంలో ఓకే చేసిన ప్రదేశంలో బ్రిడ్జిని త్వరగా నిర్మించాలని రైతులు, ప్రజలు కలెక్టర్‌ను కోరారు.







