జమ్మికుంట, అక్టోబర్ 27, 2025: BRSV రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్ పిలుపు మేరకు, జమ్మికుంట మండల అధ్యక్షుడు కొమ్ము నరేష్ ఆధ్వర్యంలో ‘హలో విద్యార్థి చలో కలెక్టరేట్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. మండలంలోని పలు విద్యాసంస్థల విద్యార్థులతో BRSV నాయకులు మాట్లాడారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు గడుస్తున్నా, రూ. 8000 కోట్ల ఫీజు రియంబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడం పేద విద్యార్థుల ఉన్నత చదువులకు ఆటంకంగా మారిందని నాయకులు మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్సైజ్ శాఖకు మంత్రిని నియమించి, విద్యాశాఖను తన వద్దే ఉంచుకోవడం విద్యను భ్రష్టుపట్టించడమేనని విమర్శించారు.
నవంబర్ 3న కళాశాలలు బంద్‌కు పిలుపునివ్వడం విద్యార్థులకు ఇబ్బందిగా మారిందని, వెంటనే బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే తల్లిదండ్రుల ఓట్లతో కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో హరీష్ వర్మ, ఆవుల తిరుపతి యాదవ్, జవ్వాజి అనిల్ తదితరులు పాల్గొన్నారు.







