బీసీ రిజర్వేషన్ బిల్లును వెంటనే ఆమోదించాలి: బీసీ సంఘాల జేఏసీ

2025 అక్టోబర్ 18
ఇల్లందకుంట: బీసీల రిజర్వేషన్ బిల్లును కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఆమోదించాలని డిమాండ్ చేస్తూ ఇల్లందకుంట మండల కేంద్రంలో బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో శాంతియుత బంద్ జరిగింది. ఈ బంద్‌లో బీసీ సంఘాలతో పాటు కాంగ్రెస్, సీపీఐ, ఎంఆర్‌పిఎస్, ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పెద్ది కుమార్, ఇంగ్లే రామారావు, అన్నం ప్రవీణ్, గుండ్ల గణపతి, తిరుమల మాట్లాడుతూ జనాభాలో సగానికిపైగా ఉన్న బీసీలకు 42% శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసి, కుల గణన పూర్తి చేసి, రాష్ట్ర శాసన సభలో ఆమోదం పొందిన బిల్లును గవర్నర్ కేంద్రానికి పంపి 3 నెలలు గడుస్తున్నా నిర్లక్ష్యం చేయడం సరికాదన్నారు.
రిజర్వేషన్లు బీసీల న్యాయమైన హక్కని, ఇది ఎవరికీ వ్యతిరేకం కాదని పేర్కొన్నారు. విద్యా, ఉద్యోగాల్లో, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు లేకపోవడం వలన బీసీలు వెనుకబాటుకు గురవుతున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తక్షణం స్పందించి, పార్లమెంటులో చట్టం చేసి, 9వ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మోత్కూరి శ్రీనివాస్, మాదారపు రత్నాకర్ సహా పలువురు నేతలు పాల్గొన్నారు.

aditya hospital banner
Listings News Offers Jobs Contact