గాంధీ జయంతిని పురస్కరించుకుని జమ్మికుంటలో బ్రహ్మకుమారీస్ (ఓం శాంతి) ఆధ్వర్యంలో అవగాహన సమావేశం నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ పాల్గొని మాట్లాడుతూ ఆధ్యాత్మికత, యోగా, మంచి అలవాట్లు, కుటుంబం, సమాజం పట్ల బాధ్యతపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. మత్తు పదార్థాలు, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని ప్రతిజ్ఞ చేయించారు. మున్సిపల్ కార్మికులను సత్కరించి, వారికి సహకరించిన బ్రహ్మకుమారీస్ను అభినందించారు. కమిషనర్ గుట్టల మల్లికార్జున స్వామి, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
జమ్మికుంట: పట్టణంలో గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ హాజరయ్యారు. మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్, కౌన్సిలర్లతో కలిసి మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పట్టణ అభివృద్ధి పనులకు ఎంపీ నిధులు కేటాయించాలని బండి సంజయ్‌ను కోరారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించినట్లు చైర్మన్ తెలిపారు. ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
సిగ్మా అకాడమీ ఆఫ్ ఫోటోగ్రఫీ నిర్వహించిన జాతీయస్థాయి వెడ్డింగ్ ఫోటోగ్రఫీ పోటీలో జమ్మికుంటకు చెందిన ఫోటోగ్రాఫర్ విజయగిరి రాంబాబు ‘సర్టిఫికెట్ ఆఫ్ మెరిట్’ అవార్డుకు ఎంపికయ్యారు. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో సిగ్మా అకాడమీ ప్రతినిధులు అవార్డును అందజేశారు. నాలుగు దశాబ్దాలుగా ఫోటోగ్రఫీ రంగంలో కొనసాగుతున్న రాంబాబు తెలంగాణ సంస్కృతి, గిరిజన జీవనశైలి, ప్రకృతి అందాలను తన ఛాయాచిత్రాల్లో ఆవిష్కరిస్తున్నారు. ఆయనకు పలువురు ఫోటోగ్రాఫర్లు అభినందనలు తెలిపారు.
ఇల్లందకుంట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ ఒడితల ప్రణవ్ బాబు ఆదేశాల మేరకు మండల అధ్యక్షుడు పెద్ది కుమార్ ఆధ్వర్యంలో గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సత్యం, అహింస, త్యాగం ద్వారా స్వాతంత్ర్య పోరాటాన్ని ప్రజా ఉద్యమంగా మార్చిన గాంధీజీ ఆశయాలను నాయకులు కొనియాడారు. సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.